జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో త్రాగునీరు, రహదారుల అభివృద్ధి పనులకు 4.65 కోట్లతో ప్రతిపాదనలు.
జంగారెడ్డిగూడెం పట్టణంలో త్రాగు నీరు, రహదారి సమస్యలకు చెక్ పెట్టేందుకు 4.65 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. ఈ మేరకు ఈనెల 29వ తేదీన ఉదయం జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించనుంది. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ముందుగా గౌరవ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కు మున్సిపల్ కమిషనర్ కొమ్మనేని వెంకటరమణ వివరించారు.
నియోజవర్గంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే రోషన్ కుమార్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ ఆదాయం పెంచడం , వాటి పనితీరు మెరుగుపరచడం ద్వారా మరింత అభివృద్ధికి తోడ్పడుతామన్నారు. త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి పట్టణ సుందరీకరణకు కోసం నిధులు మంజూరుకు కృషి చేస్తామని రోషన్ కుమార్ ఈ సందర్భంగా కమిషనర్ కు తెలిపారు.