మైనర్ బాలిక ను పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో నమ్మించి అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిపై కైకలూరు టౌన్ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి 24 గంటల్లో అరెస్ట్ చేసినట్టు కైకలూరు టౌన్ ఎస్ఐ డి. వెంకట్ కుమార్ శనివారం ఒక ప్రకటనద్వారా తెలిపారు.
ఎస్సై వెంకట్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం…
కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికను కైకలూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన సుగుణరావు అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా.. సదరు బాలిక భయంతో కేకలు వేసింది. దీంతో నిందితుడు సుగుణరావు అక్కడి నుండి పారిపోయాడు. విషయాన్ని సదరు బాలిక సాయంత్రం ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది.
ఈ ఘటనపై బాలిక తండ్రి శుక్రవారం రాత్రి కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. సదరు రిపోర్టుపై కైకలూరు టౌన్ ఎస్సై డి. వెంకట్ కుమార్ ఫోక్సో కేసు నమోదు చేసి నిందితుడు సుగుణరావును శనివారం అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం కైకలూరు కోర్టులో హాజరుపరిచామని ఎస్సై వెంకట్ కుమార్ తెలిపారు.