ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ధింగ్ ప్రాంతంలో ట్యూషన్ నుంచి ఇంటికి సైకిల్ పై వెళ్తుండగా ఆ బాలికపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు దుండగులు మోటారు సైకిల్ పై వచ్చి ఆమెను చుట్టుముట్టి, నిర్మానుష్య ప్రాంతానికి లాక్కువెళ్లి, అత్యాచారానికి పాల్పడి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడేశారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్థానికులు గుర్తించి రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను మొదట ధింగ్ లోని ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చి తదుపరి చికిత్స, వైద్య పరీక్షల కోసం నాగావ్ లోని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే ఒక అనుమానితుడిని అరెస్టు చేశామని, మరొకరిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు డీజీపీ జీపీ సింగ్ జిల్లా పోలీసు అధికారులతో కలిసి ధింగ్ ను సందర్శించారు.