సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి..
సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి అంటూ నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదశ్ ఉపాధ్యాయ సంఘం ఎన్టీఆర్ జిల్లా శాఖ ద్వితీయ కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సత్యం, అహింస ఆయుధాలుగా భారత దేశపు స్వేచ్ఛా స్వాతంత్య్ర సమరాన్ని ముందుండి నడిపిన జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా చిత్రపటాలకు పూలమలలువేసి నివాళులు అర్పించారు. స్వరాజ్యం సాధించిన బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేయడమే మన కర్తవ్యం కావాలన్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. వారి సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యాశాఖ అంటే ఒక పరీక్ష. ఛాలెంజ్ గా తీసుకుని విద్యాశాఖలో విప్లవాత్మకమైన పద్ధతులు ప్రవేశపెడుతూ విద్యార్థులు, టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల ప్రశంసలు మంత్రి నారా లోకేష్ బాబు గారు అందుకుంటున్నారు అని అన్నారు. తన వంతు బాధ్యతగా వారి సమస్యల పరిష్కారంలో లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్లి సఫలీకృతం చేసే దిశగా అడుగులు ముందుకు వేసేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా శాఖ సభ్యులు మరియు స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.