శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు

శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. గత నెల జూలైలో ప్రారంభమైన వరద ప్రవాహంతో క్రమంగా జలాశయం నిండుకుంది. జూలై 29 తేదీన జలాశయం మూడు క్రస్టు గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ పరివాహక ప్రాంతాలు జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైల జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుండడంతో శుక్రవారం డ్యామ్‌ అధికారులు జలాశయం 10 క్రస్టుగేట్లును 14 అడుగులు ఎత్తి నీటిని దిగువ నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 2,89,265 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 40,311 క్యూసెక్కులు మొత్తం 3,29,576 వరద ప్రవాహం వస్తోంది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 3,92,415 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 204.3520 టీఎంసీలుగా ఉంది.