పీఎం ఆవాస్ యోజన కింద రూ. 4 లక్షలు
పీఎం ఆవాస్ యోజన (పట్టణ) 2.0 స్కీమ్ కింద కొత్త లబ్దిదారుల ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఆర్థిక సాయం పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.2.50 లక్షలు అందించనుండగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా మరో రూ.1.50 లక్షలు ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు 2024-25లలో అమలయ్యే పీఎం ఆవాస్ యోజన (పట్టణ) 2.0 పథకం మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి తమ వాటా నిధుల్ని కేటాయించాలని సూచించింది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ లను సార్వత్రిక ఎన్నికల ముందే రాష్ట్రాలకు కేంద్రం పంపింది. పేదల ఇళ్ల నిర్మాణ పథకాల్లో అవకతవకలు, ఇళ్ల నిర్మాణంలో జాప్యాన్ని పరిశీలించేందుకు ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రతినిధుల బృందాన్ని రాష్ట్రాలకు పంపింది. వీరి నివేదిక మేరకు పీఎం ఆవాస్ యోజన (పట్టణ) 2.0 మార్గదర్శకాల్లో మార్పుచేర్పులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం అదనపు సహకారం కూడా అందించనుందని ప్రకటించింది. ఈ కొత్త మార్గదర్శకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే ఇవాళ జరిగిన సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది.