ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమకాలమనీ దక్షిణాయనము పితృకాలము గనుక అశుభకాలమనీ మన పూర్వుల విశ్వాసము. అంతేగాక ఆషాఢములోన వచ్చే కర్కాటక సంక్రమణము నుంచే ప్రారంభమయ్యే దక్షిణాయనము వానలు బురదలతో, చిమ్మచీకటితో భయంకరంగా ఉంటుంది అందునను భాద్రపదమాసమును అంతటను జలమయముగా కనిపిస్తూ ఇదే ఒక మహా వినాశమనుకోవడంలో (మహాలయ ప్రాప్తించిన దనుకోవడంలో) ఆశ్చర్యము అంతకంటే లేదు. కనుక ఈ పక్షమున అందరకూ శ్రాద్ధతర్పణములు చేయాలనీ, శ్రాద్ధాలతో వారిని సంతృప్తిపరిస్తే తమకు ప్రళయము గడుస్తుందని భావించి ఉండవచ్చని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.