శ్రీపాద ఎల్లంపల్లిలో 17 టీఎంసీలకు చేరిన నీటిమట్టం
ఎగువన మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వారం రోజుల క్రితం 6 టీఎంసీలు ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 17 టీఎంసీలకు నీరు చేరింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా వారం రోజుల్లో పది టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఎల్లంపల్లికి ప్రస్తుతం 13,659 క్యూసెక్కుల వరద వస్తుండగా, ఎత్తిపోతల కోసం ఇక్కడి నుంచి 6,631 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు నిండడానికి సిద్ధంగా ఉండటంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు షురూ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వచ్చే వరద నీటిని కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎగువకు లిఫ్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌డీఎస్‌ఏ అనుమతిస్తే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోస్తామని ఇరిగేషన్ వర్గాలు చెప్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ గేట్లు దించాల్సిన అవసరం లేకుండానే కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోయాలంటే నిర్దేశిత నీటిమట్టం నదిలో ఉండాలని చెప్తున్నారు. యాసంగి సీజన్ వరకు కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయని, అప్పటి వరకు ఎల్లంపల్లి నుంచి ఎగువన నీటి అవసరాలను బట్టి లిఫ్ట్ చేస్తామని అధికారులు చెప్తున్నారు.